అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మిచెల్ పాంపియో భారతలో పర్యటించున్నారు. ఈ నెల 25న దేశానికి రానున్న ఆయన మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపాతానికి భారత నాయకత్వం, ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతారు పాంపియో. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తొలి విదేశీ ఉన్నత స్థాయి పర్యటన.
జపాన్‌లో జూన్ 28న ప్రారంభం కాబోయే జీ-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. ఇరు దేశాధినేతల సమావేశానికి ముందు భారత్‌లో పాంపియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు అధికారులతో పాంపియో సమావేశమవుతారని ఆ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
జైశంకర్‌కు పాంపియో ఫోన్..
భారత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో జైశంకర్‌కు పాంపియో ఫోన్ చేశారు. ట్రంప్ పరిపాలన విభాగం భారత్‌తో కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపాతానికి కట్టుబడి ఉందని తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.