ప్రపంచాన్ని ముందుండి నడిపించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. ఈ మేరకు 'అమెరికా ఈజ్ బ్యాక్' అని ప్రకటించారు.
డెలావేర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో.. తన ప్రభుత్వంలో ఉండబోయే కీలక వ్యక్తుల పేర్లు ప్రకటించారు బైడెన్. అమెరికా తిరిగి అగ్రస్థానానికి చేర్చేందుకు తన బృందం సిద్ధంగా ఉందన్నారు. అంతర్జాతీయ నేతగా అమెరికాను తిరిగి చూడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని.. దానిని కచ్చితంగా నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాము శత్రువులను నిలువరిస్తామని.. కానీ మిత్రదేశాలను తిరస్కరించమని.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలనుద్దేశించి వ్యాఖ్యానించారు డెమొక్రటిక్ నేత. తమ విలువల కోసం పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్ధమైనని తేల్చిచెప్పారు.
బ్లిన్కెన్, కెర్రీతో పాటు అలీజండ్రో మాయోర్కస్(హోంల్యాండ్ సెక్యూరిటీ), ఆవ్రిల్ హైనెస్ (జాతీయ నిఘా విభాగాధిపతి), లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్(ఐరాసలో అమెరికా రాయబారి), జేక్ సల్లివన్(జాతీయ భద్రతా సలహాదారు) పేర్లను ప్రకటించారు బైడెన్.
ఇదీ చూడండి-ఇరాన్‌పై ఆంక్షలను బైడెన్ తొలగిస్తారు: రౌహానీ