జపాన్ ప్రధాన మంత్రి యొషిహిదే సుగాతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆగడాలు, క్వాడ్ దేశాల సమైక్యతపై ఇరువురు నేతలు చర్చించారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారిపై పోరు, ఉత్తరకొరియా అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఓ విదేశీ ప్రధానితో బైడెన్ ప్రత్యక్షంగా సమావేశమవ్వటం ఇదే తొలిసారి.
"ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి పునాది వేయటంలో మా కూటమి తన వంతు పాత్రను పోషించింది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి, భద్రతా వాతావరణం దృష్ట్యా మా కూటమి ప్రాముఖ్యత కొత్త శిఖరాలకు చేరింది. ఇదే ధోరణిలో ముందుకు సాగేందుకు మేం అంగీకారానికి వచ్చాం. ఆసియాన్, ఆస్ట్రేలియా, భారత్ సహా ఇతర దేశాలకూ మా సహాకారాన్ని అందిస్తాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావంపై మేం చర్చించాం. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చేసే యత్నాలను కలిసి అడ్డుకునేందుకు అంగీకారానికి వచ్చాం.''
-యొషిహిదే సుగా, జపాన్ ప్రధాన మంత్రి.
తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు తాము జపాన్‌తో కలిసి పని చేస్తామని బైడెన్ తెలిపారు.
"జపాన్, అమెరికా రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు. మానవహక్కులు, చట్టాల నియమాలు, భాగస్వామ్య విలువలను రక్షించడానికి, ముందుకు సాగడానికి మేం కట్టుబడి ఉన్నాం. 21వ శతాబ్దంలోనూ ప్రజాస్వామ్య దేశాలు పోటీ పడి, విజయం సాధించగలవని నిరూపించేందుకు మేం కలిసి పని చేయబోతున్నాం. మాకు ఎదురయ్యే సవాళ్లను మేం కలిసి ఎదుర్కొంటాం. కరోనా మహమ్మారిని కట్టడిలో, వ్యాక్సినేషన్లో సహకారాన్ని అందించుకుంటాం."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు