తెలంగాణ

telangana

ETV Bharat / international

వీసాల జారీలో భారతీయులకు మరింత లబ్ధి!

వలస విధానంలో సమూల మార్పులు చేసే దిశగా కృషిచేస్తోంది అమెరికా. నైపుణ్య ఆధారిత వలసల​ను ఐదింతలు పెంచాలని ట్రంప్​ పరిపాలన విభాగం ప్రతిపాదించింది. తాజా నిర్ణయంతో పరిమితి 57 శాతానికి పెరగనుంది.

'నైపుణ్య వీసా'ల పరిమితి పెంపుపై అమెరికా బిల్లు​

By

Published : Jul 17, 2019, 2:34 PM IST

నైపుణ్యం ఉన్నవారికే పెద్దపీట వేస్తూ.. అమెరికా వలస చట్టాల్లో నూతన విధివిధానాలను ప్రతిపాదించింది ట్రంప్​ పరిపాలన విభాగం. నైపుణ్య ఆధారిత వలసల​ను ఐదింతలు పెంచుతూ.. 57 శాతంగా నిర్ణయించింది. కుటుంబపరంగా, మానవీయ కోణంలో వచ్చేవారి కోటా సగానికి తగ్గించేందుకు ప్రతిపాదించింది.

ప్రస్తుత వలస​ విధానం ప్రపంచ దేశాల నుంచి నైపుణ్యవంతులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు అధ్యక్షుడి సీనియర్​ సలహాదారు జేరెడ్ కుష్నర్​. వచ్చే 10 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల పన్ను రాబడి సాధిస్తుందని శ్వేతసౌధంలో జరిగిన కేబినెట్​ సమావేశంలో వివరించారు కుష్నర్​.

ట్రంప్​ ఆదేశాలతో ఇమిగ్రేషన్​ సంస్కరణల బిల్లు​ను కేబినెట్​ ముందుకు తీసుకొచ్చారు కుష్నర్​. తుది రూపులు దిద్ది త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నైపుణ్యం ఆధారంగా 12 శాతం మంది మాత్రమే ఎంపికవుతున్నారని గుర్తుచేశారు.

"ప్రస్తుతం నైపుణ్య ఆధారిత వీసా పరిమితి కెనడాలో 53, న్యూజిలాండ్​లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్​లో 52 శాతంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రతిపాదన మేరకు మేము 57 శాతంగా నిర్ణయించాం. అది ప్రపంచ దేశాలతో మనల్ని పోటీలో నిలబెడుతుంది. గత ఏడాది 1.1 బిలియన్ల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఈ ఏడాది అదే సంఖ్యను కొనసాగించాలని అనుకుంటున్నాం. కానీ పౌరసత్వం ఇచ్చే విధానంలో మార్పులు కోరుకుంటున్నాం."
-జేరెడ్​ కుష్నర్​, అమెరికా అధ్యక్షుడి సీనియర్​ సలహాదారు

ఇతర దేశాల్లోని వలస విధానాలను సమగ్రంగా పరిశీలించాకే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు కుష్నర్. ప్రపంచంలోనే గొప్ప వలస విధానం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ట్రంప్​ పరిపాలన విభాగం సురక్షిత, చట్టబద్ధమైన ఇమిగ్రేషన్​ విధానాన్ని కోరుకుంటుందన్నారు. ఇష్టానుసారంగా జరిగే చట్టవిరుద్ధమైన వలసలను సహించేది లేదని స్పష్టంచేశారు కుష్నర్.

నైపుణ్య ఆధారిత వీసా విధానాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకునేది భారతీయులే. కుష్నర్​ ప్రతిపాదించిన కొత్త పద్ధతి అమల్లోకి వస్తే... భారత్​కు చెందిన మరింత మందికి సులువుగా వీసాలు లభించే అవకాశముంది.

ఇదీ చూడండి: 'వివాదాల పరిష్కారానికి కీలక సమయమిది'

ABOUT THE AUTHOR

...view details