అమెరికా-చైనా ప్రతినిధులు మధ్య వాషింగ్టన్లో గురువారం మరోసారి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద 25 శాతం వరకు సుంకాలను శుక్రవారం నుంచి పెంచుతామని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. సుంకాలు పెంచే ముందు రోజే ఇరు దేశాధికారులు చర్చలు జరిపారు.
ఈ చర్చలు ప్రారంభం కావటానికి ముందు కూడా ఇరు దేశాలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నాయి. వాణిజ్యంపై చైనాతో తాము చర్చిస్తున్న ఒప్పందాన్ని ఆ దేశ నాయకులు ఉల్లంఘించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
"నాకు నిన్న రాత్రి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుంచి ఓ మంచి లేఖ వచ్చింది. ఆయనతో ఫోన్లో సంభాషిస్తాను. అయితే చైనాతో వాణిజ్య ఒప్పందంలో ఉన్న విభేదాల పరిష్కారానికి సుంకాలు పెంచడం నాకు ఆనందంగా ఉంది. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. సుంకాలు అనేవి మా దేశానికి సంబంధించి చాలా శక్తిమంతమైనవి.
ఒప్పందంలో వారు వెనకడుగు వేశారు, వారు అలా చేయకూడదు. అయితే చైనాతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కొంత కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలూ ఒక ఒప్పందం చేసుకోవటానికి చేరువవుతున్నట్లుగా ఇటీవల కనిపించింది.
అయితే.. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఈ వారంలో సుంకాలను పెంచుతామని, కొత్త సుంకాలను విధించే అవకాశమూ ఉందని ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు.
మరో 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపైనా అమెరికా 25 శాతం సుంకాలను త్వరలో విధించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
వాణిజ్య చర్చల్లో ఇచ్చిన హామీలపై చైనా వెనకడుగు వేసిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ ఆరోపించారు.