తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడేనా?

వాణిజ్య యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా-చైనాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్​ ప్రారంభంలో పదమూడో దఫా వాణిజ్య చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సారి చర్చల్లో వాణిజ్య యుద్ధాన్ని ముగించేందుకు ఫలవంతమైన చర్చలు జరపనున్నట్లు చైనా ఓ ప్రకటనలో తెలిపింది.

వాణిజ్య యుద్ధం

By

Published : Sep 6, 2019, 4:55 AM IST

Updated : Sep 29, 2019, 2:49 PM IST

చైనా-అమెరికాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మరోమారు వాణిజ్య చర్చలు జరిపేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు చైనా ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ ప్రారంభంలో వాషింగ్టన్​లో ఈ చర్చలు జరపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. కచ్చితంగా ఏ తేదీన చర్చలు జరుగుతాయనేది వెల్లడించలేదు. ఈ సారి చర్చల ద్వారా ఇరు దేశాలకు సానుకూలమైన వాణిజ్య వాతావరణం సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో తమ మేధో సంపత్తి, సాంకేతికత బదిలీకి రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కోరుతూ వచ్చారు. అలాగే అగ్రరాజ్యం దిగుమతులకు చైనా ఎక్కువ అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. అయితే ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య పరమైన చిక్కులతో.. 12 రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి. చర్చల విఫలం తర్వాత ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచుకున్నాయి.

ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా ఇష్టానుసారంగా సుంకాలు పెంచుతోందని డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేసింది డ్రాగన్​. వివాద పరిష్కారానికే డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయితే వాణిజ్య చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా.. చైనానే చర్చల విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.

ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి.. సుంకాలను పెంచుకుంటూ పోవడం కారణంగా.. ఆ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపైనా తీవ్రంగా పడింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికీ కారణమైంది. అమెరికా సుంకాల మోతతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్ఠం వద్ద 6.2 శాతానికి పడిపోయింది.

ఇదీ చూడండి: రష్యా వేదికగా నాయక్​కు ఉచ్చు బిగించిన మోదీ

Last Updated : Sep 29, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details