తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇక విదేశీ యుద్ధాలకు అమెరికా స్వస్తి: ట్రంప్

అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని 'విదేశీ యుద్ధాలకు' ఇక అమెరికా దూరంగా ఉంటుందని స్పష్టంచేశారు. విదేశీ యుద్ధాలను హాస్యాస్పదంగా అభివర్ణించిన ఆయన.. "ఎప్పటికీ ముగియని" అలాంటి యుద్ధాలకు అమెరికా దూరంగా ఉంటుందని వెల్లడించారు.

trump
ట్రంప్

By

Published : Sep 25, 2020, 2:28 PM IST

విదేశీ సరిహద్దులను రక్షించడం, విదేశాల్లో యుద్ధాలు, ఇతర దేశాలవృద్ధికోసం గతకొన్ని దశాబ్దాలుగా అమెరికా పెడుతున్న ఖర్చుపై అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. వీటికోసం అమెరికా రాజకీయ నాయకులు లక్షల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇక ఇలాంటి ముగింపు లేని విదేశీ యుద్ధాలకు స్వస్తి చెప్పి, అమెరికా పునర్నిర్మాణానికి మాత్రమే కృషి చేస్తామని స్పష్టంచేశారు.

అమెరికన్లను బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాదుల్ని మాత్రం అణచివేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం శాంతి ద్వారానే అమెరికా పునర్నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

సైనిక శక్తిని కొనసాగిస్తాం..

ఇప్పటికే విదేశాల్లో ఉన్న తమ బలగాలను అమెరికాకు తిరిగి రప్పించడంతోపాటు అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగ కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు ఎవరైనా అమెరికాపై బెదిరింపులకు పాల్పడితే.. వారిని కచ్చితంగా అణచివేస్తామని స్పష్టంచేశారు. ‘ముగింపులేని యుద్ధాలను’ ప్రస్తావించిన ఆయన.. అమెరికా దళాలు తిరిగి వారి ఇంటికి చేరుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవ్వరికీ లేని 'సైనిక శక్తి' అమెరికా సొంతమన్న ట్రంప్‌.. ఈ సంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తమ సైన్యాన్ని బలోపేతం చేస్తూనే, శాంతికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.

ప్రచారసభకు భారీ జనం..

తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. తన సొంత ప్రాంతమైన జాక్సన్‌విల్లే ప్రచారసభకు భారీ సంఖ్యలో మద్దతుదారులు తరలిరావడంతో ట్రంప్‌ సంతోషం వ్యక్తంచేశారు. బైడెన్‌ సభకు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వస్తారని.. కానీ ఇక్కడ మాత్రం 30 వేలకుపైగా హాజరుకావడం గొప్ప విషయమని ట్రంప్‌ వెల్లడించారు.

డెమొక్రటిక్‌ అభ్యర్థి అధికారంలోకి వస్తే అమెరికాలో పన్నులు భారీగా పెంచుతారని అన్నారు. ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్‌ కూడా వెనుకంజలోనే ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్న ఈ ప్రచారసభలో భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించలేదు.

ఇదీ చూడండి:'ఎన్నికల ఫలితాన్ని ట్రంప్​ అంగీకరిస్తారు... కానీ...'

ABOUT THE AUTHOR

...view details