తెలంగాణ

telangana

ETV Bharat / international

రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్​ భవనం - violent clashes broke out between supporters of Trump and police

రిపబ్లికన్​ మద్దతుదారుల ఆందోళనతో అమెరికా క్యాపిటల్​ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ​ మద్దతుగా క్యాపిటల్​ వద్ద నిరసన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంత మంది పోలీసులపై పెప్పర్​ స్ప్రే చల్లారు. ఈ క్రమంలో నిరసనకారులను నిలువరించేందుకు తుపాకుల మోత మోగింది.

US Capitol clash: Dozens of pro-Trump protesters remain on the streets of DC after curfew
ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం

By

Published : Jan 7, 2021, 7:28 AM IST

Updated : Jan 7, 2021, 9:19 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు చేపట్టిన కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు చేపట్టిన ఆందోళన హింసాత్మతంగా మారింది. సమావేశానికి వేదిక అయిన క్యాపిటల్‌ భవనంలోకి నిరసనకారులు బారికేడ్లు తోసుకుంటూ చొచ్చుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలు చల్లి వారితో ఘర్షణకు దిగిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లారు.

ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం

ఆ సమయానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ నేతృత్వంలో రాష్ట్రాల వారీగా ఓట్ల ధ్రువీకరణ ప్రక్రియ సాగుతోంది. అలబామా, అలస్కాలో ఓట్లను ధ్రువీకరించారు. ఆ రెండురాష్ట్రాల్లో 12 ఓట్లు అక్కడ గెలిచిన ట్రంప్‌కే చేరాయి. అదే సమయానికి ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకెళ్లడంతో.. క్యాపిటల్‌ భవనాన్ని మూసివేశారు. కాంగ్రెస్‌ సభ్యులు గ్యాస్‌ మాస్కులు ధరించాలని సిబ్బంది సూచించారు. బయటివారు లోపలకు, లోపలవారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా సభ్యులను హుటాహుటిన మరో మార్గంలో ఖాళీ చేయించారు. అద్దాలు పగలగొట్టి లోపలికి చేరిన ఆందోళనకారులు లోపల హల్‌చల్ చేశారు. అప్పడు క్యాపిటల్‌ భవనంలో కాల్పులు జరిగి గాయపడిన మహిళ.. తర్వాత ఆసుపత్రిలో మృతిచెందింది.

క్యాపిటోల్​ వద్ద నిరసనలో వెల్లువ
ట్రంప్​ మద్దతుదారులు

ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలు, జాతీయ గార్డ్‌ విభాగం సిబ్బందిని క్యాపిటల్‌ భవనం వద్దకు తరలించారు. ఘర్షణలపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇళ్లకు వెళ్లిపోవాలని ఆందోళనకారులను కోరారు.అధ్యక్ష ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని ట్రంప్‌ మరోసారి ఆరోపించారు. బైడెన్‌ ఎన్నికను తోసిపుచ్చాలని చేసిన వినతిని మైక్ పెన్స్‌ తిరస్కరించడంతో ఆయనపై ట్రంప్ విరుచుకుపడ్డారు. పెన్స్ తన నిజాయతీని చూపలేదని ఆరోపించారు. క్యాపిటల్‌ వద్ద జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన అసాధారణ దాడి అని ఈనెల 20న అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌ అన్నారు.

పోలీసులుతో బాహాబహికి దిగిన ఆందోళన కారులు

ఇప్పుడు ప్రజాస్వామ్యంపై అసాధారణ దాడి జరిగింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ప్రజా ప్రతినిధులను క్యాపిటల్‌ హిల్‌ పోలీసులు కాపాడడాన్ని మనం చూశాం. చట్టంపై జరిగిన ఈ దాడిని ఎన్నడూ చూడలేదు. ఆందోళనల సందర్భంగా కనిపించిన దృశ్యాలు నిజమైన అమెరికాను ప్రతిబింబించవు. కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారు. ఇది దేశద్రోహం. ఇవి తప్పకుండా ఇప్పుడే ఆగిపోవాలి. ఆందోళనకారులంతా వెనక్కివెళ్లి పోయి ప్రజాస్వామ్యం ముందుకు సాగేలా చేయాలి.

-జో బైడెన్‌, ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు

4 గంటల ఆందోళనల తర్వాత ఆందోళనకారులందరినీ క్యాపిటల్‌ భవనం నుంచి ఖాళీ చేయించిన పోలీసులు భవనం సురక్షితమే అని..ప్రకటించారు. ఆందోళనకారులు లోపలికి వచ్చే లోపే ఓట్ల బాక్స్‌లను అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు వాషింగ్టన్‌లో కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.

ఇంటికి వెళ్లండి..

క్యాపిటల్‌ భవనం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్​ స్పందించారు. ఆందోళనకారులు అందరూ తిరిగి ఇంటికి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మద్దతుదారులను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

మీ బాధ, ఆవేదన నాకు తెలుసు. కానీ ఇది ఇంటికి వెళ్లాల్సిన సమయం. అధ్యక్ష ఎన్నికలు మోసపూరితంగా జరిగాయి. అధికారాన్ని మన నుంచి దొంగతనంగా లాగేసుకున్నారు. మనం శాంతిని పాటించాలి. దయచేసి మీరు ఇంటికి వెళ్లండి.

-అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

ఆందోళనకారులను ఇంటికి వెళ్లాలని ట్రంప్​ పిలుపు

ఇదీ చూడండి: క్యాపిటోల్​ భవనం వద్ద తూటా తగిలి మహిళ మృతి

Last Updated : Jan 7, 2021, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details