చైనాపై మరోసారి ఆంక్షల అస్త్రాలను సంధించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందనే కారణంతో చైనాకు చెందిన అతిపెద్ద చిప్ తయారీ సంస్థ, ప్రభుత్వ చమురు సంస్థ సహా నాలుగు కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు ప్రకటించింది అగ్రరాజ్య రక్షణ శాఖ. డ్రాగన్ సైన్యానికి మద్దతిచ్చే చైనా కంపెనీలు అమెరికా సాంకేతికత, పెట్టుబడులు పొందకుండా నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
" ఈరోజు అమెరికాలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పనిచేస్తోన్న మరిన్ని కమ్యూనిస్ట్ చైనా మిలిటరీ సంస్థల పేర్లను రక్షణ శాఖ విడుదల చేసింది. బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన చైనా సంస్థల్లో.. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసీ), చైనా నేషనల్ ఆఫ్‌షోర్ ఆయిల్ కార్పొరేషన్ (సీఎన్ఓఓసీ), చైనా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కంపెనీ (సీసీటీసీ), చైనా ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ (సీఐఈసీసీ) ఉన్నాయి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మిలిటరీ, సివిల్ కుమ్మక్కు వ్యూహాన్ని బయటపెట్టటానికి, ఎదుర్కోవటానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం."
- అమెరికా రక్షణ శాఖ
ప్రస్తుత నిర్ణయంతో.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన సంస్థల సంఖ్య 35కు చేరింది. గతంలో ఈ ఏడాది జూన్‌లో తొలి జాబితాను కాంగ్రెస్‌కు అందించింది రక్షణ శాఖ.