కరోనావైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తును చైనా అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ వ్యాప్తి విషయంలో అంతర్జాతీయ సమాజం చైనాను జవాబుదారీ చేయాలని అమెరికా విదేశంగా మంత్రి మైక్ పాంపియో డిమాండ్ చేశారు. తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్లే ప్రపంచమంతా ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుందని అగ్రదేశం వీలుచిక్కినప్పుడల్లా చైనాపై మండిపడుతూనే ఉంది. ఆ వైరస్‌ను 'చైనా వైరస్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.
"కరోనావైరస్ ప్రపంచాన్ని చట్టుముట్టి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తప్పుడు సమాచారాన్నే ప్రచారం చేస్తోంది. వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య సంస్థ చేస్తోన్న దర్యాప్తును అడ్డుకుంటోంది. చైనా తయారు చేసిన టీకాల విషయంలో పారదర్శకత కొరవడంతో పాటు, క్లినికల్ ట్రయల్స్ గురించి సమాచారం ఇవ్వకుండా..వాటిని ప్రజలకు అందజేస్తోంది. ఈ తీరు చైనా పౌరులను, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుంది"
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.