కరోనా ఉపశమన ప్యాకేజీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకుండా మొండిగా వ్యవహరించడం వల్ల లక్షలాది అమెరికన్లకు ప్రయోజనం చేకూరే విషయంపై సందిగ్ధత తలెత్తింది. అమెరికా కాంగ్రెస్లో అనూహ్య మెజారిటీతో ఆమోదం పొందిన ప్యాకేజీ.. ట్రంప్ అభ్యంతరాలతో నిలిచిపోయింది. గడువులోగా సంతకం చేయకపోతే.. ఈ బిల్లు రద్దవుతుంది.
ఫలితంగా దాదాపు కోటి 10 లక్షల మంది ప్రభుత్వ సహాయాన్ని కోల్పోతారని బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఆర్థిక విభాగ నిపుణులు లారెన్ బావర్ తెలిపారు. థాంక్స్ గివింగ్ డే తర్వాత నిరుద్యోగులు అధికమయ్యారు కాబట్టి.. వీరి సంఖ్య కోటి 40 లక్షల వరకు ఉండొచ్చని నిరుద్యోగ బీమా నిపుణులు ఆండ్రూ స్టెట్నర్ పేర్కొన్నారు. లక్షల మంది ఈ ప్రయోజనాలను కోల్పోతారని చెప్పారు.
'మహమ్మారి నిరుద్యోగ సహకారం' కింద ఆర్థిక ప్రయోజనం పొందుతున్న 95 లక్షల మందికి ఈ సహాయం శనివారంతో ఆగిపోనుంది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి.. ఈ డబ్బులపై ఆధారపడినవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బిల్లుపై ట్రంప్ సంతకం చేయకపోతే.. జనవరి నుంచి ఆర్థికంగా తమకు ఎలాంటి భరోసా ఉండదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ ఏమంటున్నారంటే...
బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ తిరస్కరించారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్న అమెరికన్లకు 600 డాలర్లకు బదులు రెండు వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనవసర వ్యయాలు తగ్గించాలని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను చట్టసభ్యులు తోసిపుచ్చారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు.