అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి సంవాదంలో కరోనా విపత్తుపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య చర్చ రసవత్తరంగా సాగింది. కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని ట్రంప్ తెలిపారు. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామని అన్నారు. నవంబర్లోనే వ్యాక్సిన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ తప్పుపట్టారు. అధ్యక్షుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చినా.. దానిని పంపిణీ చేసేందుకు కొన్ని నెలలు పడుతుందని బైడెన్ అన్నారు.
నిర్లక్ష్యం చేశారంటూ..
కరోనా విషయంలో మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఫిబ్రవరిలోనే సమాచారం వచ్చినా సరైన చర్యలు చేపట్టలేదని, ప్రజారోగ్యం కన్నా ఆర్థిక వ్యవహారాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఫల్యం కారణంగా 2 లక్షల మంది అమెరికన్ ప్రజలు కొవిడ్‌తో మరణించారని అన్నారు. 70 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారని, ఈ పరిణామాలల్లో వాళ్లు ఆరోగ్య రక్షణకు ఎలాంటి హామి ఇవ్వగలరని ప్రశ్నించారు.
కరోనా విషయంలో అధ్యక్షుడు దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సొంతంగా కూడా జాగ్రత్తలు పాటించలేదని విమర్శలు చేశారు. తాము సంయమనం పాటించామని, ప్రజల ఆరోగ్యం, సామాజిక దూరం పట్టించుకోకుండా ట్రంప్ వ్యవహరించారని మండిపడ్డారు.