ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తూ ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ త్వరలోనే తమతో చర్చించేందుకు వస్తుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు.
అణు ఒప్పందంపై కొన్ని ఆంక్షల అమలును నిలిపివేస్తున్నామని ఇరాన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇరాన్లో ఉత్పత్తయ్యే ఇనుము, అల్యూమినియం, రాగి లోహాల వాణిజ్యం, ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది శ్వేతసౌధం. ఇప్పటికే ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం.
" పారిశ్రామిక లోహాల ఎగుమతుల వల్ల ఇరాన్ పొందుతున్న ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. వాటిపై ఆంక్షలు విధిస్తున్నాం. వేరే దేశాలు ఇరాన్ నుంచి స్టీల్ సహా ఇతర లోహాలను దిగుమతి చేసుకుంటే ఎంతో కాలం సహించం" -- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ఏదో ఒక రోజు తమతో చర్చలకు వస్తారని భావిస్తున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.