తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్న ట్రంప్​! - డొనాల్ట్ ట్రంప్​ న్యూస్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్ఛార్జి అయ్యే అవకాశాలున్నాయి. రెమిడెసివిర్​ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు వెల్లడించారు. రక్తంలో ఆక్సిజన్​ స్థాయి తగ్గిపోవటంతో ఇటీవలి కాలంలో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్​ అందించామని పేర్కొన్నారు.

trump to discharge from hospital on monday
నేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్న ట్రంప్​!

By

Published : Oct 5, 2020, 4:37 AM IST

కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సోమవారమే డిశ్ఛార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్​ స్థాయి తగ్గిపోవటంతో ఇటీవలి కాలంలో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్​ అందించామని శ్వేతసౌధం వైద్యులు ఆదివారం తెలిపారు.

శుక్రవారం ఒకదశలో ఆక్సిజన్​ 94%కంటే దిగువకు పడిపోయిందని వైద్యులు వివరించారు. ఇప్పుడు పరిస్థితి బాగుందని జ్వరం ఏమాత్రం లేదని తెలిపారు. రెమిడెసివిర్​ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల పనితీరు సాధారణస్థితికి చేరుకుందని వైద్యులు వెల్లడించారు.

ట్రంప్​ ఒక వీడియో విడుదల చేస్తూ రాబోయే కొద్దిరోజులు నిజంగా తనకు పరీక్షాకాలమని, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. తాను ఆసుపత్రిలో చేరినప్పటికంటే ఇప్పుడు బాగున్నానని తెలిపారు. అధికారులు బయటకు చెప్పిన దానికంటే ట్రంప్​ పరిస్థితి శుక్రవారం మాత్రం సంక్లిష్టంగా ఉందని అంతకుముందు శ్వేతసౌధం సిబ్బంది అధిపతి మార్క్​ మెడోస్​ చెప్పారు. జ్వరం, ఆక్సిజన్​ స్థాయిలపై తామెంతో ఆందోళన చెందామని అనూహ్యరీతిలో ట్రంప్​ కోలుకున్నారని ఆయన అన్నారు.

'అమెరికా నుంచే కాదు యావత్​ ప్రపంచం తరఫున వైరస్​తో పోరాడుతున్నా. దాని నుంచి బయటపడాలనే ఆశాభావంతో ఉన్నా. కచ్చితంగా వైరస్​ను మట్టికరిపిస్తాం. నేను తీసుకుంటున్న చికిత్సలు అద్భుతాలు. అందుకే నేను బాగున్నా' అని ట్రంప్​ తాజా వీడియోలో చెప్పారు.

జ్వరం లేదు

అధ్యక్షుడికి ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, తామంతా అత్యంత అప్రమత్తంగా ఉన్నామని శ్వేతసౌధం ఫిజీషియన్​ సియాన్​ కాన్లే చెబుతున్నారు. రెమిడెసివిర్​ రెండో మోతాదునూ ట్రంప్​ తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ట్రంప్​కి జ్వరంలేదని, ఆక్సిజన్​స్థాయి 96-98మధ్య ఉంటోందని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పాల్గొనకపోవటమే ఉత్తమమనే సలహాలను పట్టించుకోకుండా ట్రంప్​ నాలుగు వారాలుగా విస్తృతంగా పర్యటిస్తూ వైరస్​కు చిక్కారని గట్టిగా వినిపిస్తోంది. ఆగిపోయిన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లటంపై ట్రంప్​ బృందం గట్టి కసరత్తు చేస్తోంది. ఆయన వచ్చేవరకు సమయం వృథా కాకుండా కార్యాచరణ రూపొందించింది. కీలక రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ ట్రంప్​ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా ప్రచారంలోకి దిగుతారు. అధ్యక్షుడి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా అది ఏళ్లతరబడి బయటకు రాకపోవటం అగ్రరాజ్యంలో రివాజే , గతంలో వుడ్రో విల్సన్​, గ్రోవర్​ క్లీన్​లాండ్​, లిండన్​ బీ జాన్సన్​, ఫ్రాంక్లిన్​ రూజ్​వెల్ట్​ విషయంలోనూ ఇలాగే గోప్యత పాటించారు.

ఏం జరిగితే జరగనీయండి

శ్వేతసౌధంలో గదికి పరిమితమైతే సరిపోతుందని తనకు వైద్యులు చెప్పినా ప్రజల్ని చూడకుండా, వారితో మాట్లాడకుండా ఉండలేనని ట్రంప్​ తెలిపారు. 'గదిలోనే సురక్షితంగా బందీగా ఉండటం నావల్లకాదు. ఏం జరిగితే జరగనీయండి. ఒక నేతగా సమస్యలతో పోరాడాల్సిందే' అని పేర్కొన్నారు. ప్రథమ మహిళ మెలానియా బాగా కోలుకుంటున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details