తెలంగాణ

telangana

ETV Bharat / international

'నేను మళ్లీ గెలిచానో... చైనా పని అంతే!'

డ్రాగన్​ దేశంపై మరోమారు విరచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 2020కి ముందుగానే అమెరికాతో చైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని సూచించారు. అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు తాను గెలిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.

'నేను మళ్లీ గెలిచానో... చైనా పని అంతే!'

By

Published : May 12, 2019, 10:27 AM IST

Updated : May 12, 2019, 11:16 AM IST

చైనాకు ట్రంప్ హెచ్చరికలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన నేపథ్యంలో డ్రాగన్​ దేశాన్ని హెచ్చరించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికాతో ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకోవాలని... 2020లో మరోసారి తాను అధ్యక్షుడినయ్యాక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ట్వీట్​ చేశారు.

"ఇటీవల జరిగిన చర్చల్లో అమెరికా తమను చాలా తీవ్రంగా దెబ్బకొట్టిందని చైనా భావిస్తోందని నేను అనుకుంటున్నాను. అందుకే వారు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. డెమొక్రాట్​ పార్టీ అభ్యర్థి గెలిచి వారికి అదృష్టం కలుగుతుందేమోనని చూస్తున్నారు. అదే జరిగితే అమెరికాకు ఏడాదికి 500 బిలియన్​ డాలర్లు మోసం చేయడాన్ని చైనా కొనసాగించాలని చూస్తుంది.

కానీ... అమెరికా చరిత్రలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగుల సంఖ్య తగ్గుదల వంటి ఎన్నో కారణాలతో 2020లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నేనే గెలుస్తానని చైనాకు తెలుసు. నేను రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వాణిజ్య చర్చలు జరపాలని వారు భావిస్తే... ఆ ఒప్పందం ఎంతో దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకోవడం చైనాకు మంచిది. కానీ... ఎక్కువ సుంకాలు వసూలు చేయడం నాకు ఎంతో ఇష్టం."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఒప్పందం లేకుండానే ముగిసిన చర్చలు

అమెరికా రాజధాని వాషింగ్టన్​ డీసీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య రెండు రోజుల వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. వెంటనే మరింత దూకుడు పెంచింది ట్రంప్ సర్కార్​. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాన్ని పెంచేందుకు సిద్ధమైంది.

500 బిలియన్​ డాలర్ల విలువైన దిగుమతులపై సంకాలు

అమెరికా-చైనా ప్రతినిధుల భేటీకి ముందు 200 బిలియన్ డాలర్లు విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10 నుంచి 25 శాతానికి పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి లియూ హీతో రెండు రోజుల చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరనందున మరో 300 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని అధ్యక్షుడు నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

Last Updated : May 12, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details