భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఎగుమతికి భారత్ అనుమతించిన నేపథ్యంలో మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు ట్రంప్. ఆపద సమయంలో భారత్ చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.
కరోనాపై పోరాటంలో భారత ప్రజలకే కాకుండా మొత్తం మానవత్వానికే సహాయం చేశారని మోదీని కొనియాడారు ట్రంప్. ప్రధాని బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.
"మా అభ్యర్థన మేరకు ఔషధాల ఎగుమతికి అనుమతి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. ఈ సహాయాన్ని మేం గుర్తుంచుకుంటాం. అసాధారణ సమయంలో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. హెచ్‌సీక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత దేశానికి, ప్రజలకు ధన్యవాదాలు. దీన్ని ఎప్పటికీ మర్చిపోము."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మోదీ రిప్లై
అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి సమయాలు స్నేహితులను మరింత దగ్గరకు చేర్చుతాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుంది. ఈ పోరాటాన్ని కలిసి గెలవాలి."