అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం కోర్కుకెక్కింది. పెన్సిల్వేనియా, మిషిగన్లలో ఫలితాలపై ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో దావా వేసినట్లు తెలిపింది. లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నిపుణులైన పరిశీలకులను నియమించేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే తెరిచిన బ్యాలెట్ ఓట్ల పరిశీలనకు అనుమతించే వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ బృందం కోరింది.
రీకౌటింగ్...?
విస్కాన్సిన్లో రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది డొనాల్డ్ ట్రంప్ బృందం. విస్కాన్సిన్లోని పలు కౌంటీలలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో ఎన్నికలు పూర్తయిన మూడు రోజుల తర్వాత వచ్చిన ఓట్లు కూడా లెక్కించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ట్రంప్ ప్రచార డిప్యూటీ మేనేజర్ జస్టిన్ క్లార్క్ పేర్కొన్నారు.
పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. అయితే మెయిల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న నేపథ్యంలో మెజారిటీ క్రమంగా పడిపోతోంది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ల విషయంలో మోసాలు జరిగిన ఘటనలేవీ బయటపడలేదు. ఈ రాష్ట్రంలో 31 లక్షల మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఎలక్షన్ డే(నవంబర్ 3) వరకు మార్క్ చేసిన బ్యాలెట్లను.. శుక్రవారం వరకు లెక్కించనున్నారు.
'మేం సిద్ధం'