తెలంగాణ

telangana

ETV Bharat / international

పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్ - ట్రంప్ వార్తలు

అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎంతవరకైనా పోరాడతానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎలక్టోరల్ కాలేజీలో బైడెన్ ఎన్నికను సవాల్ చేయాలని రిపబ్లికన్లను అభ్యర్థించారు. అయితే ఆయన ప్రకటనపై సొంతపార్టీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trump says he'll ''fight like hell'' to hold on to presidency
పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్

By

Published : Jan 5, 2021, 1:11 PM IST

అధ్యక్ష పదవిని నిలబెట్టుకునేందుకు ఎంతవరకైనా పోరాడతానని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలో జో బైడెన్​ సాధించిన విజయాన్ని తారుమారు చేయాలని రిపబ్లికన్ చట్టసభ్యులను కోరారు. జార్జియాలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్ గెలవడాన్ని శ్వేతసౌధం స్వీకరించదని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందానని పునరుద్ఘాటించారు.

అంతకుముందు, వాషింగ్టన్​లో రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యులకు పలు సూచనలు చేశారు ట్రంప్. బుధవారం జరిగే కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికకు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయాలని కోరారు.

చీలికలు!

అయితే.. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనపై రిపబ్లికన్ పార్టీ సభ్యుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పార్టీ చీలికకు దారితీస్తోంది. కొంత మంది సభ్యులు ట్రంప్​కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు మాత్రం అమెరికా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలు చేపట్టవద్దని హితవు పలుకుతున్నారు. మోసాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఫలితాలపై అనుమానాలు వ్యక్తం మంచిది కాదని అంటున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల మోసాలపై రిపబ్లికన్ పార్టీలో చీలికలు!

మాజీ నేతలు సైతం ట్రంప్ నిర్ణయానికి అభ్యంతరం తెలిపారు. ఫలితాలను వ్యతిరేకించే సమయం మించిపోయిందని ఇప్పటికే 10 మంది అమెరికా మాజీ రక్షణ మంత్రులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రిపబ్లికన్లు ఏమేరకు నెట్టుకొస్తారో తెలియనప్పటికీ.. ట్రంప్ మాత్రం అదే రోజు శ్వేతసౌధం సమీపంలో ర్యాలీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్​లో తమదే ఆధిపత్యం ఉంటుందని సూచిస్తూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఫలితాలను మార్చాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా మండిపడ్డారు. అధ్యక్షుడిగా చేయాల్సిన పనిని పక్కనబెట్టి.. ఫిర్యాదులు చేయడంపైనే దృష్టిసారించారని ఆరోపించారు. తన సమయాన్నంతా దీనికోసమే వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ట్రంప్ లక్ష్యంగా విమర్శలు సంధించారు.

ఇదీ చదవండి:ట్రంప్​ మద్దతుదారుకు ప్రెసిడెంట్​ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details