అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. అదే సమయంలో మరింత దూకుడు పెంచింది ట్రంప్ సర్కార్. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాన్ని పెంచేందుకు సిద్ధమైంది.
"అమెరికా-చైనా ప్రతినిధుల భేటీకి ముందు 200 బిలియన్ డాలర్లు విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10 నుంచి 25 శాతానికి పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి లియూ హీతో రెండు రోజుల చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరనందున మరో 300 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని అధ్యక్షుడు నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సుంకం పెంపుపై తుది నిర్ణయాన్ని త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్లో నమోదు చేస్తాం."
-రాబర్ట్ లైతీజర్, అమెరికా వాణిజ్య ప్రతినిధి
ట్రంప్ ఆగ్రహం
ఇరు దేశాల వాణిజ్య చర్చల విఫలంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో చైనా తీరుపై మండిపడ్డారు.
"ఇరు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంగా లేదు. చైనాకు మేం కేవలం 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాం. ఏటా 500 బిలియన్ డాలర్లు కోల్పోతున్నాం. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతోంది. చైనాతో ఈ వింత వాణిజ్యానికి ఇక చెల్లు.