ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు మరింత ద్వేషపూరితంగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలనూ ఆహ్వానిస్తామని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా.. బీజింగ్ చుట్టూ వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, అవి జనాదరణ పొందవని ఆగ్రహించింది.
అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల బృందాన్ని జీ7 అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలు ఇందులో సభ్య దేశాలు. ఎవరైతే ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తారో వారు తమకు సన్నిహితంగా గల మరో రెండు దేశాలను ఆహ్వానించే అవకాశం ఉంటుంది. గత సమావేశాలకు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు.
జీ10 లేదా జీ11 మార్చాలని..
కరోనా వైరస్ కారణంగా ఈసారి జీ7 సదస్సును సెప్టెంబర్ నెలకు వాయిదా వేసిన ట్రంప్.. కాలం చెల్లిన ఈ బృందాన్ని జీ10 లేదా జీ11గా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. భారత్, రష్యా సహా మరో రెండు దేశాలను ఈ సమూహంలో కలపాలన్నారు. అయితే ఇందులో చైనా దేశాన్ని ప్రస్తావించలేదు.