2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ పెద్ద వివాదమే నడిచింది. ఈ విషయంపై మ్యూలర్ నివేదిక ట్రంప్‌నకు క్లీన్చిట్ ఇవ్వడం వల్ల కాస్త దుమారం సద్దుమణిగింది. అయితే తాజాగా చల్లారిన అగ్నికి ట్రంప్ ఆజ్యం పోశారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించిన సమాచారం విదేశాలు ఇస్తానంటే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి పెను దుమారానికి తెరతీశాయి.
ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ముఖాముఖిలో ట్రంప్ ఈ విషయం ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్ధి విదేశీ సహాయాన్ని పొందడంలో తప్పేమీ లేదని వాదించారు. అంటే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు విదేశాల నుండి కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని ట్రంప్ చెప్పారు.
రష్యా, చైనాలు ప్రత్యర్ధిపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధపడితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ సహాయం తీసుకోవడం వరకు తప్పేమీ లేదని, అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదన్నారు. సమాచారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.