అమెరికా మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా నాయకుడు ఖాసీం అల్-రిమిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
"యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్ పెనిన్సులాలో అల్‌ఖైదా (ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్-రమిని హతమార్చాం. రమి నేతృత్వంలో సామాన్య పౌరులపై ఏక్యూఏపీ వికృత హింసాకాండకు పాల్పడింది. అతడి మృతితో అల్‌ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని ఏక్యూఏపీ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అతణ్ని ఎప్పుడు మట్టుబెట్టింది మాత్రం తెలపలేదు.
డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికా నావికాదళానికి చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, దాడికి పాల్పడ్డ ముష్కరుణ్ని అమెరికా వెంటనే మట్టుబెట్టింది.
ప్రతీకార దాడిలో హతం!
మరోవైపు ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఏక్యూఏపీ గత ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మహ్మద్ అల్‌షమ్రానీగా గుర్తించిన అతడు దాడికి ముందు అమెరికాపై తన విద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఓ వీడియో విడుదల చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఓ వర్గంపై జరుగుతున్న హింసకు అమెరికా అండగా ఉంటోందని.. అందుకే తాను ఆ దేశాన్ని ద్వేషిస్తున్నానని అతడు పేర్కొన్నట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. ఈ దాడికి ప్రతీకారంగా అమెరికా తాజాగా జరిపిన దాడుల్లో ఖాసీం అల్-రమి హతమయ్యాడు.