2020 జనాభా లెక్కల్లో పౌరసత్వ ప్రశ్నను చేర్చాలన్న వివాదాస్పద ప్రతిపాదనపై అమెరికా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ ప్రశ్న జోడించే ఆలోచన విరమించుకుంటున్నట్లు ప్రకటించింది ట్రంప్ సర్కార్. అమెరికాలో ఉంటున్నవారి పౌరసత్వం ఏంటో తెలుసుకునేందుకు ఓ ప్రశ్నను చేర్చాలన్న ప్రతిపాదనను అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకున్న కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయం పౌర హక్కుల సంఘాలకు పెద్ద విజయంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.
పౌరసత్వ ప్రశ్న చేర్చటం వల్ల మైనారిటీ ఓటర్లకు రక్షణ పెరుగుతుందని శ్వేతసౌధం పేర్కొంది. కానీ వలసదారుల కుటుంబాలు జనాభ గణనలో పాల్గొనకుండా చేస్తుందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. 1950 నుంచి ఇప్పటి వరకు పౌరసత్వ ప్రశ్నను చేర్చలేదని గుర్తుచేశాయి.