అభిశంసన ఓ తిరుగుబాటు అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఈ క్రమంలో ట్రంప్, కాంగ్రెస్ మధ్య అభిశంసన వివాదం తారస్థాయికి చేరింది. మాటల యుద్ధం మొదలైంది.
2020 ఎన్నికల్లో ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కు నష్టం కలింగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెంస్కీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు డెమొక్రాట్లు.
అభిశంసనపై ముందుకు సాగేందుకు నిజమైన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ దిగువ సభలో దర్యాప్తునకు నాయకత్వం వహించిన డెమొక్రాట్ ఆడమ్ షిఫ్ పేర్కొన్నారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు ట్రంప్. ఇది అభిశంసన కాదు తిరిగుబాటు అంటూ మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. షిఫ్ అనారోగ్యానికి గురయ్యారు.. రాజీనామా చేయాలంటూ బుధవారం ట్వీట్ చేశారు ట్రంప్. అంతకుముందు షిఫ్ అరెస్ట్‌కు పిలుపునిచ్చారు.