మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. త్వరలోనే అగ్రరాజ్యంతో ఇరాన్ సంప్రదింపులు జరిపే అవకాశముందన్నారు. అమెరికా- ఇరాన్ దేశాల మధ్య తాజా పరిణామాలు యుద్ధానికి దారి తీసే అవకాశముందన్న కొంతమంది విశ్లేషకుల వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు.
"ఇరు దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలున్నాయి. కానీ తుది నిర్ణయం నేనే తీసుకుంటా. త్వరలో ఇరాన్ చర్చలకు సిద్ధపడుతుందని నా నమ్మకం."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఇరాన్‌పై ఒత్తిడి పెంచే క్రమంలో ప్రభుత్వంలో అంతర్గతంగా గందరగోళం నెలకొందన్న వార్తా కథనాలను ట్రంప్ ఖండించారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్తోపాటు ఎర్బిల్లోని అమెరికా రాయబారి కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వెనక్కి రావాలని ట్రంప్ సర్కారు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల్లోని సిబ్బంది మినహా ఇతర సిబ్బంది వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది.