అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీకాలను తీసుకొచ్చే ట్రక్కులు తయారీ కేంద్రం నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిషిగన్‌లోని ప్లాంటు నుంచి ఫైజర్ టీకాలు బయటకు రానున్నాయి. తొలుత 30 లక్షల డోసులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమంలో వైద్య సేవల సిబ్బంది, నర్సింగ్ హోం సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ!
టీకా రవాణాలో భాగంగా సోమవారం 145 పంపిణీ కేంద్రాలకు డోసులు చేరుకుంటాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. మంగళవారం 425, బుధవారం మరో 66 కేంద్రాలకు సరఫరా అవుతాయని చెప్పారు. రాష్ట్రాలు గుర్తించిన అన్ని కేంద్రాల్లోకి మూడు వారాల్లోగా టీకాను చేరవేస్తామని స్పష్టం చేశారు. వయోజన జనాభా ఆధారంగా టీకా డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.
మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయగలిగే సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు టీకాలను చేరవేస్తున్నారు. టీకా రవాణా కోసం అంటార్కిటికా కంటే చల్లగా ఉండేలా కంటైనర్లను రూపొందించింది ఫైజర్. డ్రై ఐస్, జీపీఎస్ సెన్సార్లను వీటిలో ఉపయోగిస్తోంది.