ట్రాఫిక్ 'జామ్' చేస్తున్నందుకు టోల్ వసూల్ అమెరికాలోని న్యూయార్క్లో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అక్కడి పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో రోడ్లపైకి వచ్చేవారి నుంచి టోల్ రుసుము వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. అలా చేస్తే... కొందరైనా కార్లు వదిలి... సబ్వేలు, బస్సుల్లో ప్రయాణిస్తారని పాలకుల ఆశ. మన్హాటన్లోని రద్దీ ప్రదేశాల్లో సొంత వాహనాల్లో ప్రయాణించే వారి నుంచి 12 డాలర్లు వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవలే రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచి, ఆమోదం పొందారు.
టోల్ వసూలు కోసం ప్రత్యేకంగా కౌంటర్లేమీ ఉండవు. నిర్ణీత ప్రదేశాల్లో యంత్రాలు ఉంచుతారు. వాహనం వాటిని దాటి వెళ్తే... ప్రీపెయిడ్ ఖాతా నుంచి టోల్ రుసుము కట్ అవుతుంది. రోజులో ఎన్నిసార్లు ప్రయాణించినా ఒక్కసారి టోల్ ఛార్జీ చెల్లిస్తే చాలు.
2020 డిసెంబర్ నుంచి టోల్ విధానం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అమెరికా నగరంలో ఇలా టోల్ వసూలు చేయడం ఇదే తొలిసారి.
కొత్త పద్ధతి వల్ల న్యూయార్క్ ఖజానాకు ఏటా బిలియన్ డాలర్లు ఆదాయం అదనంగా వస్తుందని అంచనా. రోడ్ల మరమ్మతు సహా ఇతర ముఖ్య పనులకు ఈ సొమ్ము వినియోగిస్తారు.
'డ్రైవర్లకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవు. సరిగా లేని రోడ్లపైనే వాహనాలు నడుపుతున్నారు. దీనివల్ల వాహనాలు దెబ్బతింటాయి. కానీ సబ్వేస్, రైళ్లను మరమ్మతు చేయడానికి టోల్ ఛార్జీలు చెల్లించమని అడుగుతున్నారు.'
- రాబర్ట్ సిన్కైయిర్, అమెరికా ఆటో అసోసియేషన్ ప్రతినిధి
లండన్, సింగపూర్లో ఇప్పటికే రద్దీగా ఉండే రోడ్లలో టోల్ వసూలు చేసే విధానం అమలులో ఉంది.