చైనాపై అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) నుంచి పొంచి ఉన్న ముప్పు వాస్తవమని పేర్కొన్నారు. ఇది గ్రహించిన అమెరికా ప్రభుత్వం.. చైనాతో సంబంధాలపై సరైన చర్యలు చేపడుతోందన్నారు. అమెరికన్ల భద్రత, రక్షణను కాపాడే విధంగా ఈ చర్యలు ఉంటాయని వెల్లడించారు.
"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2015లో ప్రచారం చేస్తున్న సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎదురవుతున్న ముప్పును గుర్తించారు. ఆ ముప్పు వాస్తవం. అందుకే చైనాతో సంబంధాల విషయంలో సరైన చర్యలు చేపడుతున్నాం. చైనా తొలుత మన మేథో సంపత్తిని దొంగిలించింది. అనంతరం దాన్ని తిరిగి మనకే అమ్మింది. భారీ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడింది. దీని వల్ల అమెరికాలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనిని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.