అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. డగ్ హార్లీ, బాబ్ బెంకెన్‌లు అంతరిక్ష నౌక క్రూ డ్రాగన్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ యాత్రకు సంబంధించిన వీడియోలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూశారు. ఇందులో గాల్లో తేలుతున్న ఓ డైనోసార్ విశేషంగా ఆకర్షించింది. అయితే అదో ఆటబొమ్మ అని తర్వాత తెలిసింది. ఆ రాక్షస బల్లి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే.. డైనో టాయ్‌ను అంతరిక్షంలోకి ఎందుకు తీసుకెళ్లారో తెలుసా. జీరో గ్రావిటీ ఇండికేటర్‌గా వాడేందుకే తన కుమారుడి దగ్గరనుంచి తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చారు వ్యోమగామి బెంకెన్. ఆ బొమ్మ అంతరిక్షంలో గాల్లో తేలుతుంటే క్రూ సిబ్బంది జీరో గ్రావిటీలోకి చేరినట్టేనట.
''మాకిరువురికీ పిల్లలున్నారు. వారికి డైనోసార్లపై అమితాసక్తి. ఇంట్లో ఉన్న ఆ బొమ్మలన్నింటినీ తీసుకొచ్చాం. ఇప్పుడు మా పిల్లలు సంతోషపడుతున్నట్టున్నారు.''
- ప్రయోగం తర్వాత బెంకెన్
డైనో బొమ్మ విశేషాలు..
గత వారం స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ప్రయోగంలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది డైనోసార్ బొమ్మ. ఇది ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఆ డైనోసార్ బొమ్మ మోడళ్లు అన్ని ప్రముఖ స్టోర్లలో భారీగా అమ్ముడయ్యాయి.
- గులాబీ, నీలి రంగుల్లో ఉన్న ఈ ఆటబొమ్మను.. క్రూ డ్రాగన్ జీరో గ్రావిటీ ఇండికేటర్‌గా పనిచేసింది.
- టీవైస్ కంపెనీ ఫ్లిప్పబుల్ కలెక్షన్లో భాగంగా ఆ ఒరిజినల్ డైనో.. 4.99 డాలర్లకు అమ్ముడుబోయింది. ఇప్పుడు టీవై, వాల్‌మార్ట్, మైకేల్స్, జోఆన్స్ వంటి ప్రముఖ రిటైల్ స్టోర్లలోనూ ఈ బొమ్మలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడు స్టాక్ కూడా లేనంతగా.
- అమెజాన్ కూడా ఈ బొమ్మను పోలిన డైనోసార్లను(నాక్ ఆఫ్స్) ఆన్లైన్లో విక్రయించడం ప్రారంభించింది. స్పేస్ ఎక్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన టాయ్‌ను పోలిన 'డెమో 2 డైనోసార్ ప్లష్ టాయ్'లను 25 డాలర్లకు అమ్మకానికి పెట్టి కాసేపటికే సైట్ నుంచి తొలగించింది.