సెంట్రల్ మెక్సికోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా వచ్చిన వరదలు ప్రభుత్వాసుపత్రిని ముంచెత్తగా 16 మంది రోగులు మరణించారు. ఏకధాటిగా కురిసిన వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. దీనితో ఆక్సిజన్ అందకపోవడం వల్లే ప్రాణనష్టం సంభవించిందని జాతీయ భద్రతా సంస్థ తెలిపింది. ఈ విలయం నుంచి 40 మంది రోగులు ప్రాణాలతో బయటపడగా.. అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రిని ఖాళీ చేయించింది.
ఆసుపత్రిని ముంచెత్తిన వరదలు - 16మంది మృతి - మెక్సికో అకాపుల్కో రిసార్ట్ భూకంపం
07:36 September 08
మెక్సికో వరద విలయం..
భూకంపంతో అతలాకుతలం..
మరోవైపు మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి వచ్చిన ఈ భూకంపం ధాటికి భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు ఒక నిమిషానికి పైగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గెరెరో రాష్ట్రంలోని ప్యూబ్లో మాడెరోకు తూర్పు ఆగ్నేయంగా 8 కిలోమీటర్ల దూరంలో భాకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రత 7.0గా నమోదైనట్లు ప్రకటించింది.
ఈ భూకంపం ధాటికి 200 మైళ్ల దూరంలో ఉన్న మెక్సికో నగరంలో భవనాలు ఊగిపోయినట్లు విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది.