వ్యాధి లక్షణాలు బయటపడటానికి 9 రోజుల ముందే స్మార్ట్ వాచీలు, శరీరంపై ధరించే ఇతర సాధనాలతో కొవిడ్-19ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి నిరంతరం శరీరంలోని ముఖ్య సంకేతాలను పరిశీలించి, కీలక మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
మొత్తం 5300 మందిపై అధ్యయనం చేసి, వారిలో కొవిడ్ బారినపడ్డ 32మంది డేటాను విశ్లేషించారు. వీరిలో 26 మందికి(81 శాతం) గుండె స్పందన రేటులో మార్పులు వెలుగు చూశాయి. ఒక రోజులో వేసే అడుగుల సంఖ్య లోనూ, నిద్ర సమయంలోనూ వైరుధ్యాలు కనిపించాయి. 22 కేసుల్లో వ్యాధి లక్షణాలు ప్రారంభం కావడానికి ముందు కానీ, మొదలవుతున్నప్పుడు కానీ మార్పులు కనిపించాయి. నాలుగు కేసుల్లో కనీసం 9 రోజులు ముందు అవి వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ వాచీలు ఇతర ఉపకరణాల ద్వారా సదరు వ్యక్తుల కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా శ్వాసకోస ఇన్ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. తద్వారా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, సకాలంలో చికిత్సకు వీలు కలుగుతుందని వివరించారు.