కొవిడ్-19కు చికిత్స చేయడం కోసం మరో ఔషధం అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ఒక ముందడుగు వేశారు. ఇన్ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు వైరస్ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవులపైనా క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి తుది దశలో ఉన్నాయని వివరించారు.
మోల్నుపిరావిర్(ఎంకే-4482) అనే ఈ ఔషధంపై అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్), బ్రిటన్‌లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుందని వారు చెప్పారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం అనేకరకాల టీకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వైరస్ వల్ల సోకే ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి అన్ని సమర్థ ఔషధాలు లేవన్నారు. అందువల్ల తాజా ఆవిష్కారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించారు.