స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీవో)లకు విదేశాల నుంచి అందే నిధులు/విరాళాలకు సంబంధించి భారత్‌లో అమలవుతున్న ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలె ఆందోళన వ్యక్తం చేశారు.
మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులు సైతం తమను మనోవేదనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
‘‘భారత్ దీర్ఘకాలంగా బలమైన పౌర సమాజంగా గుర్తింపు పొందింది. దేశీయంగా, అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేసింది. కానీ, ఇటీవల ఆ దేశంలో కొన్ని అనిశ్చిత చట్టాలు అమల్లోకి వచ్చాయి. మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను అవి నొక్కేస్తున్నాయి’’
---మిషెల్ బాచెలే, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్
ఎన్‌జీవోలు, మానవ హక్కుల కార్యకర్తల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మిషెల్ వ్యాఖ్యల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ దిల్లీలో స్పందించారు. చట్టాల రూపకల్పనపై భారత్ సార్వభౌమాధికారాన్ని కలిగి ఉందన్నారు. మానవ హక్కుల ముసుగులో చట్టాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.