ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దక్షిణ అమెరికా దేశం.. అర్జెంటీనాను ఈ సమస్య వేధిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తప్పించుకుని లావాదేవీలు చేస్తూ తమకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీరు ఉపయోగించే విధానం ఏంటో తెలుసా... పూర్వీకులు అనుసరించిన వస్తుమార్పిడి పద్ధతే.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివారు పట్టణం మెర్లో. ఈ పట్టణ నివాసితులు వారాంతాల్లో ఒక చోట సమావేశమవుతారు. వారికి కావలసిన వస్తువులను తీసుకొని, ఇతరులకు కావలసినవి ఇస్తుంటారు. సామాజిక మాధ్యమాలలో ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఇలా ఒక ప్రత్యేక స్థలంలో వస్తుమార్పిడి చేసుకుంటారు.
"ప్రజల నిత్యవసరాల కొనుగోలుకు ఈ మార్కెట్ వేదికైంది. ఇంతకుముందు వివిధ రకాల వస్తువుల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ఆహార పదార్థాల మార్పిడే జరుగుతోంది. ఒక వైపు ధరలు పెరిగాయి. ఎంత శాతం పెరిగాయనేది నేను కచ్చితంగా చెప్పలేను కానీ గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి."
-లాలు, వస్తుమార్పిడి మార్కెట్ నిర్వాహకురాలు