'కింద పడ్డా నాదే పై చేయి' అనే నానుడికి అతికినట్టు సరిపోతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైనా.. ఆయన దానిని ఇంకా అంగీకరించడం లేదు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కోర్టులకు వెళ్లినా ఆయనకు భంగపాటు తప్పడం లేదు. తాజాగా పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా కోర్టులలో ట్రంప్ ప్రచార బృందం దాఖలు చేసిన వ్యాజ్యాలు తిరస్కరణకు గురయ్యాయి. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని న్యాయస్థానాలు వాటిని కొట్టి పారేశాయి.
పెన్సిల్వేనియా..
పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు వచ్చిన 9,300 మెయిల్ ఇన్ బ్యాలెట్లను లెక్కించవద్దని ట్రంప్ ప్రచార బృందం దాఖలు చేసిన పిటిషన్ను ఫెడరల్ అప్పీల్ కోర్టు తిరస్కరించింది. కొవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మూడు రోజులు అదనంగా గడువు ఇవ్వడం సమర్థనీయమని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరి ఓటును లెక్కించడం ముఖ్యమని పేర్కొంది.
కరోనా నేపథ్యంలో పెన్సిల్వేనియాలో ప్రజలు నవంబరు 6వరకు మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 68 లక్షల ఓట్లు పోలవ్వగా.. జో బైడెన్ 60వేల ఆధిక్యంతో గెలిచారు.
ఎన్నికల్లో కీలకమైన ఈ రాష్ట్రంలోని 20 ఎలక్టోరల్ ఓట్లను గెలిచేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నారు ట్రంప్. న్యాయస్థానంలో మొత్తం 15 పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఒక్క ఆధారం చూపలేకపోయారు.