యాంటీపారాసైటిక్ ఔషధం 'ఐవర్‌మెక్టిన్'ను క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవిడ్-19 బారినపడే ముప్పు గణనీయంగా తగ్గుతోందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ ఔషధం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తమకు లభించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి ఈ మేరకు తేల్చినట్లు పేర్కొన్నారు.
అమెరికన్ జర్నల్ థెరపెటిక్స్ మే-జూన్ సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. క్లినికల్, ఇన్ విట్రో, జంతువులు, ఇతర అధ్యయనాల నుంచి తీసుకున్న డేటాను చాలా సమగ్రంగా సమీక్షించినట్లు రచయితలు తెలిపారు.
"ఐవర్‌మెక్టిన్‌పై అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్ర విశ్లేషణ చేపట్టాం. అత్యున్నత ప్రమాణాల మేరకు అధ్యయనం సాగించి ఈ ఔషధం కరోనా మహమ్మారిని అంతం చేయగలదని తేల్చాం."