కరోనా వైరస్ బారినపడి అమెరికాలో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉంటుందని శ్వేతసౌధంలో కొవిడ్-19పై పోరు కోసం ఏర్పాటైన కార్యదళంలో కీలక సభ్యుడు అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. అయితే, ఎంత ఎక్కువ అన్నది మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనన్నారు.
న్యూయార్క్ వంటి నగరాల్లో కేసులు భారీగా పెరిగి అక్కడి ఆస్పత్రులు తీవ్ర రద్దీని ఎదుర్కొంటున్న సమయంలో అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. వారిలో కొంతమంది మృతిచెంది ఉంటారని.. వారి మరణాలు అధికారిక లెక్కల్లోకి వచ్చి ఉండవని తెలిపారు.
ఫౌచీ తాజా వ్యాఖ్యలు అక్కడి కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం... 14 లక్షల మందికి పైగా వైరస్ బారినపడగా..వీరిలో 83,425 మంది మృత్యువాతపడ్డారు. 2,96,746 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
మరోవైపు ఆగస్టు 4 నాటికి అమెరికాలో 1,47,040 మంది కొవిడ్ వల్ల మరణించే అవకాశం ఉందని ఓ ప్రముఖ సంస్థ అంచనా వేసింది. ఆంక్షల సడలింపు నేపథ్యంలో వైరస్ వ్యాప్తి మరింత పెరిగి ఎక్కువ మందిని పొట్టనబెట్టుకునే అవకాశం ఉందని సీయాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్' అభిప్రాయపడింది. ఇదే సంస్థ మరణాల సంఖ్య 1,34,475గా ఉండొచ్చని గత నెల అంచనా వేయడం గమనార్హం.
ఇదీ చదవండి:113 ఏళ్ల వయసులో కరోనాను కసితీరా ఓడించి!