అమెరికాలో తొలి ర్యాపిడ్ టెస్టుకు ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. అబాట్ లేబరేటరీస్ తయారు చేసిన ఈ కిట్ ద్వారా 15 నిమిషాల్లోనే కరోనా ఫలితం తెలుసుకోవచ్చు. ఇది 5 డాలర్లకే అందుబాటులో ఉండనుంది. దీనికోసం ఎలాంటి కంప్యూటర్ వ్యవస్థ అవసరం లేదు. ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను పరీక్షించేందుకు ఉపయోగించే సాంకేతికతనే ఈ ర్యాపిడ్ టెస్టుల కోసం వినియోగించారు. చాలా తక్కువ ధరలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చు.
ముక్కులోని నమూనాలను ఉపయోగించి ఈ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తారు. అయితే ల్యాబ్‌లో నిర్వహించే పరీక్షలతో పోలిస్తే వీటి కచ్చితత్వం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినవారు ల్యాబ్ టెస్టులు నిర్వహించుకోవాలని ఎఫ్‌డీఏ సూచించింది.
లాలాజలంతో నిర్వహించే కరోనా పరీక్ష కోసం ఇటీవలే యేల్ విశ్వవిద్యాలయానికి అనుమతులు మంజూరు చేసింది. దీనికి ముక్కులోని నమూనాలు అవసరం లేదు. అయితే అత్యాధునిక ల్యాబుల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.
మార్గదర్శకాలు సవరణ
మరోవైపు, కొవిడ్ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను అమెరికా మరోసారి సవరించింది. కరోనా వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, కరోనా సోకిన వ్యక్తులకు ఆరడుగులలోపు 15నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితేనే కొవిడ్ టెస్ట్‌కు వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా నెగటివ్ రిపోర్టు వచ్చినంత మాత్రాన వైరస్ సోకలేదనుకోవడంగా భావించవద్దని, తర్వాతి కాలంలో వైరస్ సోకే ప్రమాదం ఉందని వెల్లడించింది. అందుకే, లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోనట్లుయితే పదిరోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.