"ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. మానసిక సమస్యలతో బాధపడుతుంటే కుటుంబంలో ఎవరూ సాయం చేయలేదు సరికదా.. నాపై నిందలు వేశారు. వీటివల్ల ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి" అంటూ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన ఈ దంపతులు తొలిసారిగా ఓ టీవీ షోలో మాట్లాడారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
చచ్చిపోదామనకున్నా..
"హ్యారీని పెళ్లి చేసుకోకముందు రాచరికపు జీవితం గురించి నాకు ఏమాత్రం తెలియదు. రాణి ముందు ఎలా ఉండాలి అనేది కూడా అవగాహన లేదు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్యాలెస్‌లోకి వచ్చాక ఇలా ఉండాలి అలా చేయాలంటూ అనేక ఆంక్షలు ఉండేవి. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేది. అలా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా.. రాజకుటుంబంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. పైగా నాపై అసత్య ఆరోపణలు చేశారు. నిందలు వేశారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. రాజకుటుంబంలో నాకు రక్షణ ఉండదని పెళ్లి అయిన కొద్దిరోజులకే అర్థమైంది."
-మేఘన్ మార్కెల్
కొడుకు రంగు గురించి భయపడ్డారు..
"నేను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగింది. నేను నల్లగా ఉన్నాను కాబట్టి.. నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారు. దీని గురించి హ్యారీతో వారు చర్చించారు. అంతేగాక, మా బిడ్డకు భద్రత ఉండదని, టైటిల్ కూడా రాదని మాట్లాడుకున్నారు’’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కేట్ వల్ల ఏడ్చా..
"రాజకుటుంబంతో నాకు సఖ్యత లేదని, నా వల్ల తోడికోడలు కేట్ ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. పెళ్లి రోజున ఫ్లవర్ గర్ల్ దుస్తుల విషయంలో కేట్ కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డా. ఏడ్చా. అయితే, ఆ తర్వాత కేట్ క్షమాపణలు చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది. కానీ బయట మాత్రమే నా వల్లే తప్పు జరిగినట్లు ప్రచారం జరిగింది."
-మేఘన్ మార్కెల్