అమెరికా నేతృత్వంలో తొలిసారి నేరుగా సమావేశమైన క్వాడ్ దేశాల(quad countries) అధినేతలు.. దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాల తీరును ఖండించారు. ప్రధానంగా పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఉగ్ర ముఠాలకు(Terrorism in Asia) ఎలాంటి సాయాన్నైనా అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
శుక్రవారం శ్వేతసౌధంలో జరిగిన క్వాడ్ సదస్సు(quad summit 2021) అనంతరం ఉమ్మడి ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని యొషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. అఫ్గానిస్థాన్(Afghanistan crisis) పట్ల దౌత్య, ఆర్థిక, మానవ హక్కుల విధానాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. అలాగే.. దక్షిణాసియాలో ఉగ్రవాద నిర్మూలన, మానవతా సహకారాన్ని మరింత పెంచనున్నట్లు చెప్పారు.
"ఉగ్రవాదాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించే విధానాలను ఖండిస్తున్నాం. ఆర్థికంగా, సైనిక, ఇతర ఏ విధంగానూ ఉగ్రవాద ముఠాలకు సాయం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాని ద్వారా సరిహద్దుల్లో దాడుల వంటి ఉగ్రదాడులకు దారి తీస్తుంది. అఫ్గానిస్థాన్ భూభాగం ఉగ్ర ముఠాలకు అడ్డాగా మారకూడదు. అఫ్గాన్‌లో ఉగ్రవాదం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్ పౌరులకు మద్దతుగా నిలుస్తాం. దేశాన్ని వీడాలనే పౌరులకు సురక్షిత సౌకర్యాలను కల్పించాలని తాలిబన్లను కోరుతున్నాం. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను గౌరవించాలి."