కరోనా సంక్షోభ నివారణకు సహకరించిన ఇద్దరు ప్రముఖ భారతీయ అమెరికన్లకు '2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్' గౌరవం దక్కింది. అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు ముందు ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫౌండేషన్ ప్రకటించిన ఈ గౌరవ పురస్కారం పొందిన 38 మంది వలసదారుల్లో వీరూ ఉండడం విశేషం.
పులిట్జర్ బహుమతి గ్రహీత, ప్రముఖ్ అంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ, హార్వర్డ్ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ రాజ్ చెట్టిని... '2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్' పురస్కారంతో గౌరవిస్తున్నట్లు కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ తెలిపింది.
సిద్ధార్థ ముఖర్జీ:దిల్లీలో జన్మించిన సిద్ధార్థ్ ముఖర్జీ జీవశాస్త్రవేత్తగా, అంకాలజిస్టుగా ప్రసిద్ధులు. ఆయన రాసిన 'ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్'కు పులిట్జర్ బహుమతి వరించింది.
ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ వైద్యునిగానూ సేవలందించారు. ఆయనకు 2014లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది.
ఎనలేని కృషి..
"కొవిడ్ సంక్షోభ సమయంలో ముఖర్జీ తన వ్యాసాలు, మీడియా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఫోరమ్లు, తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు."