భారత్- అమెరికా మైత్రి.. ఆసియాలో కొన్ని దేశాలకు వణుకు పుట్టిస్తోంది. దాయాది పాకిస్థాన్, పొరుగు దేశం చైనాను ఆందోళనలో పడేస్తోంది. అయితే అంతకుముందు పరిస్థితి భిన్నం. ఈ స్థాయికి ఇరు దేశాల మైత్రి బంధం ఎదగడానికి ఎందరో కృషి చేశారు. ప్రస్తుతం ఇరు దేశాలు అజేయ శక్తులుగా ప్రపంచంలో తమ మైత్రిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో ఇది మరో స్థాయికి చేరనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా ఈ నెల 24, 25న భారత్‌లో పర్యటించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఎన్నడూ చూడని, ఇక మీద చూడలేనంతటి ఆతిథ్యాన్ని భారత్ ఇవ్వనుంది.
ట్రంప్ ఆసక్తి...
భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్ ఇటీవల అన్నారు. విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మోదీ తనకు చెప్పినట్లు ట్రంప్ ప్రకటించారు. దాదాపు లక్షమంది ఉన్న సభలో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఒప్పందాలు మాత్రం...
భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలు కుదరవచ్చని ట్రంప్ పర్యటనకు కొద్ది రోజుల ముందే చర్చ మొదలైంది. అనూహ్యంగా ఆ అంచనాలకు తెర దించారు ట్రంప్. వాణిజ్య ఒప్పందం విషయంలో ఇప్పట్లో ముందడుగు పడదని తేల్చిచెప్పారు. అయితే... రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇరువురు నేతలు అడుగులు వేయనున్నారు. ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు కలుపుకొని మొత్తం 60 వరకు అత్యున్నతస్థాయి సమావేశాలు జరిగాయి. రెండో దఫా 2+2 చర్చలు 2019 డిసెంబర్లో వాషింగ్టన్ వేదికగా సాగాయి.
అంతకుముందు...
2016 జూన్‌లో భారత్- అమెరికా 'అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' కుదుర్చుకున్నాయి. భారత్‌ను 'ప్రధాన రక్షణ భాగస్వామి'గా అమెరికా పేర్కొంది. తనకు అత్యంత సన్నిహిత, భాగస్వామ్య దేశాలతో సమానంగా భారత్‌ను ముందుకు తెచ్చింది అగ్రరాజ్యం.
2005 ముందు 40 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ ఎటువంటి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోలేదు. అయితే తరువాతి 15 సంవత్సరాలలో భారత రెండవ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా అమెరికా అవతరించింది. 18 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక పరికరాలు సరఫరా చేస్తోంది. ఇంకా చాలా ఒప్పందాలు క్యూలో ఉన్నాయి.
ఈ మార్పు ఊహించారా..?
1971 డిసెంబరులో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్.. భారత్‌ను నిలువరించేందుకు యుద్ధనౌక 'యూఎస్ఎస్ ఎంటర్ప్రైజ్' నేతృత్వంలోని యూఎస్ 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతానికి పంపారు.
పాకిస్థాన్ నుంచి విముక్తి పొందేందుకు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులకు భారత్ సాయమందించకుండా నియంత్రించేందుకు అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ఇది నమ్మశక్యం కాకపోయినా నిజం.
అంతేకాదు ఆసియాలో భారత్‌కు దీటుగా తన కొత్త మిత్రదేశం చైనాను అప్పట్లో అమెరికా ప్రోత్సహించింది.
ఆంక్షలకూ వెనుకాడలేదు...
1998 మే లో భారత్ అణ్వాయుధ దేశంగా అవతరించినప్పుడు అమెరికా ఆంక్షలు విధించాలని ప్రయత్నించింది. అయినప్పటికీ, అప్పటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్, అమెరికా కార్యదర్శి స్ట్రోబ్ టాల్బోట్ మధ్య విస్తృత వ్యూహాత్మక చర్చలు జరిగాయి. 1998-2000 మధ్య 3 ఖండాల్లోని 7 దేశాలలో 14 సార్లు కలిసిన వీరు ఇరు దేశాల మధ్య ఉన్న సంక్షోభాన్ని అవకాశంగా మార్చారు.
క్లింటన్‌తో నాంది...