అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, మైక్ పెన్స్‌ల సంవాదం 90 నిమిషాల పాటు వాడీవేడిగా సాగింది. ట్రంప్ ప్రభుత్వంపై కమల విరుచుకుపడగా.. తమ పరిపాలనా విధానాలను పెన్స్ సమర్థించుకున్నారు.
జాతి వివక్షపై..
ట్రంప్ హయాంలో నల్ల జాతీయులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు కమల. కోర్టులలో 50 శాశ్వత నియామకాలు జరిగితే అసమర్థ వ్యక్తులను ఎంపిక చేశారని మండిపడ్డారు. ఒక్క నల్లజాతీయుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. బ్రయానా టేలర్ కేసులో ఇంకా న్యాయం జరగలేదని విమర్శించారు. జార్జి ఫ్లాయిడ్ మృతి అనంతరం అనేక మంది ర్యాలీలు నిర్వహించారని గుర్తు చేశారు.
జార్జి ఫ్లాయిడ్ నిరసనల్లో హింసాత్మక ఘటనలు, దుకాణాల్లో లూటీలు జరిగాయని మైక్ పెన్స్ అన్నారు. అలాంటి చర్యలను ప్రభుత్వం సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మిత్రదేశాలకు వెన్నుపోటు..
అమెరికా మిత్ర దేశాలను ట్రంప్ వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు చేశారు కమల. నియంతృత్వ దేశాలతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. విదేశాంగ విధానాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఇరాన్ అణుఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలగాల్సి వచ్చిందన్నారు. అమెరికా మిత్రదేశాలు.. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కే ఎక్కువ గౌరవం ఇస్తున్నాయని హారిస్ అన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, అమెరికా నిఘా వర్గాల కంటే వ్లాదిమిర్ పుతిన్ మాటలనే ట్రంప్ విశ్వసిస్తారని దుయ్యబట్టారు.
ట్రంప్ హయాంలో ఐసిస్ ఉగ్రసంస్థపై ఉక్కుపాదం మోపాపని మైక్ పెన్స్ తెలిపారు. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఇరాక్ ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం అంతమొందించిందని గుర్తు చేశారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇరాక్‌లో జరిగిన దాడిలో అమెరికా బలగాలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు హారిస్. కొంత మంది సైనికులకు మెదడు గాయాలు అయితే ట్రంప్ వాటిని తలనొప్పి అని తోసిపుచ్చారని విమర్శలు గుప్పించారు.
కరోనాపై..
కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమల. ప్రభుత్వ అసమర్థత వల్ల 2లక్షల మందికిపైగా అమెరికన్లు వైరస్‌కు బలయ్యారని తెలిపారు. వైరస్ వ్యాప్తి గురించి ప్రభుత్వానికి జనవరి చివర్లోనే సమాచారం అందినా ముందస్తు చర్యలు చేపట్టలేక పోయారని ధ్వజమెత్తారు.
వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టిందని పెన్స్ అన్నారు. అందువల్లే వేలాది మంది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందన్నారు. కరోనా వైరస్‌కు చైనానే కారణమని తెలిపారు. ఆ దేశంపై ప్రయాణ ఆంక్షలు విధిస్తే బైడెన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఐదు వ్యాక్సిన్ క్యాండిడేట్లు మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.