ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తుకు చిక్కి ఇద్దరు వ్యక్తులు మరణించగా, భవనాలు కూలిపోయి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
హువాతుల్కో వద్ద సంభవించిన ఈ భూకంపంతో దక్షిణ, సెంట్రల్ మెక్సికోలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. 26 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని... దాని ప్రభావం 12 కి.మీ మేర కనిపించిందని అమెరికా భూకంప హెచ్చరికల కేంద్రం తెలిపింది.
భూకంపం సంభవించిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.