ప‌్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్విరామ కృషి జరుగుతోంది. వీటిలో ఇప్పటికే పలు కంపెనీలు మానవులపై ప్రయాగదశలో కొంత పురోగతి సాధించాయి. తాజాగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తోపాటు, అమెరికా ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన టీకా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. మానవుల్లో జరిపిన తొలిదశ ప్రయోగాల్లో వైరస్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిమందికి ఈ మహమ్మారి సోకగా, వీరిలో ఇప్పటివరకు 5లక్షల 15వేల మంది బలయ్యారు. ఈ మహమ్మారి అంతం చేసేందుకు ఇప్పటికే 17కంపెనీలు వ్యాక్సిన్ రూపకల్పనలో భాగంగా మానవ ప్రయోగదశకు చేరుకున్నాయి. తాజాగా బయోఎన్‌టెక్, ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా కూడా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే మానవప్రయోగాల్లో ముందున్న ఆక్స్‌ఫర్డ్, మోడెర్నా, కాన్సినో బయోలాజిక్స్, ఇనోవియా ఫార్మాల సరసన తాజాగా ఈ కంపెనీలు చేరాయి.
బయోఎన్‌టెక్ కంపెనీ 'BNT162b1' పేరుతో రూపొందించిన వ్యాక్సిన్‌ను 24 మంది వాలంటీర్లపై రెండు డోసుల్లో పరీక్షలు నిర్వహించింది. 28రోజుల అనంతరం వైరస్ సోకిన వారికంటే వీరిలో అధికంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు తేలిందని కంపెనీ స్పష్టంచేసింది. ఈ వ్యాక్సిన్ శరీరంలో రోగనిరోధకశక్తిని గణనీయంగా పెంచుతున్నట్లు తొలిప్రయోగంలో నిరూపితమైనట్లు బయోఎన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉగుర్ సాహిన్ తెలిపారు. అయితే, వైరస్ సంక్రమణ నుంచి కాపాడుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ ప్రయోగంలో నలుగురికి మూడు వారాల్లో రెండు ఇంజెక్షన్లు చేయగా, వీరిలో ముగ్గురికి స్వల్ప జ్వరం మాత్రమే వచ్చినట్లు గుర్తించామని బయోఎన్‌టెక్ తెలిపింది. ఇంజెక్షన్ నొప్పి కారణంగా మూడో డోస్‌ను మరో బృందంపై పరీక్షించామని పేర్కొంది. ఏప్రిల్, మే నెలలో జరిపిన ప్రయోగాల ఫలితాలతోపాటు మరో మూడురకాల వ్యాక్సిన్ వివరాలను తొందరలోనే ప్రకటిస్తామని బయోఎన్‌టెక్ సంస్థ వెల్లడించింది.
మరో దశ ప్రయోగానికి సిద్ధం..
తదుపరి ప్రయోగాలు జులై చివరి వారంలో నిర్వహించేందుకు బయోఎన్‌టెక్, ఫైజర్‌లు సిద్ధమయ్యాయి. నియంత్రణ సంస్థల అనుమతి రాగానే అమెరికాతోపాటు ఐరోపాలో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనిలోభాగంగా దాదాపు 30వేల మంది ఆరోగ్యవంతులపై ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకొన్నట్లు సమాచారం. అంతేకాకుండా వ్యాక్సిన్ విజయవంతమైతే 2020 చివరి నాటికి దాదాపు 20కోట్ల డోసులను, 2021చివరకు 120కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.