జనవరి నెలలో అమెరికాలో కరోనా కట్టలు తెంచుకున్నప్పటికీ.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం, టీకా పంపిణీ వేగం పుంజుకోవడం అక్కడి ప్రజలకు ఊరటనిస్తోంది. మహమ్మారి కారణంగా ఒక్క జనవరిలోనే ఏకంగా 95వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు సగటున మూడు వేలకు పైగా మంది మృతిచెందారు.
అయితే ఫిబ్రవరి ఒకటి నాటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్షలోపునకు పడిపోయింది. ఇది రెండు నెలల కాలంలో అత్యల్పం.
జనవరి మధ్యలో రోజుకు సగటున 2.5 లక్షల కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ సంఖ్య 1.48 లక్షలకు తగ్గింది. మొత్తం యాభై రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి వస్తోంది.
మరోవైపు, డిసెంబర్ మధ్యలో ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇప్పటివరకు 3.11 కోట్ల డోసులను అందించారు. జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 20 నుంచే 1.46 కోట్ల డోసులను పంపిణీ చేయడం విశేషం.