తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస వేదికగా పాక్- చైనాకు జైశంకర్ చురకలు

ఐరాసలో పాకిస్థాన్​కు తీవ్ర స్థాయిలో చురకలు అంటించారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదులకు రాజమర్యాదలు చేస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటించేవారిని ప్రశ్నించేందుకు ప్రపంచ దేశాలు వెనకాడకూడదని అన్నారు. ఉగ్ర సంస్థలకు కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పేర్కొన్నారు.

UNSC JAISHANKAR
ఐరాస వేదికగా పాక్​కు జైశంకర్ చురకలు

By

Published : Aug 19, 2021, 9:30 PM IST

Updated : Aug 19, 2021, 10:52 PM IST

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్​ను ఉగ్రవాద పోషక దేశంగా నిలిపే ప్రయత్నం చేసింది భారత్. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పరోక్షంగా పాక్​నుద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై ఒక్కో విధంగా స్పందించే తీరు ఉండకూడదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది.

ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రవాదుల చర్యల వల్ల అంతర్జాతీయ శాంతికి కలుగుతున్న ముప్పు గురించి సభ్య దేశాలకు వివరించారు. హక్కానీ నెట్​వర్క్ విస్తరించడం ఆందోళనకరమని అన్నారు.

"మా పొరుగు దేశంలో.. ఐఎస్ఐఎల్-ఖోరాసన్ ఉగ్రసంస్థ మరింత శక్తిమంతంగా తయారవుతోంది. క్రమంగా విస్తరిస్తోంది. అఫ్గానిస్థాన్​లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అఫ్గాన్​లో కానీ భారత్​లో కానీ.. లష్కరే, జైషే వంటి సంస్థలు కొందరి మద్దతుతో ఇంకా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాబట్టి, మనం ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యూహాత్మక విధానాన్ని అనుసరించకూడదు. అమాయకుల రక్తం చేతులకు అంటుకున్న ఉగ్రవాదులకు.. రాజమర్యాదలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. అలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించే దేశాలను ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకాడకూడదు."

-జైశంకర్, విదేశాంగ మంత్రి

చైనాకు చురక

ఈ సమావేశంలో చైనాకూ పరోక్షంగా చురకలు అంటించారు జైశంకర్. మసూద్ అజర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించకుండా చైనా అడ్డుపడటాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు చేసే ప్రయత్నాలకు అడ్డుపుల్లలు వేయొద్దని హితవు పలికారు. ఉగ్రవాదుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే.. వారికే కీడు జరుగుతుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాలని అన్నారు. ఉగ్రవాద చర్యలకు ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని చెప్పారు.

అఫ్గాన్​తో సంబంధాలపై

మరోవైపు, అఫ్గానిస్థాన్​లో ప్రస్తుత పరిణామాలు సాధారణంగానే ప్రపంచ దేశాలకు ఆందోళకరమని అన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఈ పర్యవసనాలు ప్రభావం చూపిస్తాయని అన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అఫ్గాన్​ ప్రజలతో భారత్​కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'అఫ్గాన్​లో కాదు.. ఉగ్ర ముప్పు ఆ దేశాల్లోనే ఎక్కువ'

Last Updated : Aug 19, 2021, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details