తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆక్సిజన్‌ కొరత.. ఆఫ్రికా, లాటిన్‌ దేశాలు విలవిల! - ఆక్సిజన్​

అసలే కరోనాతో విలవిల్లాడుతున్న ఆఫ్రికా, లాటిన్​ అమెరికా దేశాలను..ఆసుపత్రులతో ఆక్సిజన్ లేమి వేధిస్తోంది. ఆక్సిజన్​ కొరత వల్ల ఏర్పడ్డ ఈ సంక్షోభం అనవసర మరణాలకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

medical-oxygen-scare-in-latin-america-africa
ఆక్సిజన్‌ కొరత..ఆఫ్రికా, లాటిన్‌ దేశాలు విలవిల!

By

Published : Feb 26, 2021, 8:41 AM IST

కరోనా వైరస్‌ విజృంభణతో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడి ఆసుపత్రులు మెడికల్‌ ఆక్సిజన్‌ లేమితో విలవిలలాడుతున్నాయి. ఆక్సిజన్‌ కొరత వల్ల ఏర్పడ్డ ఈ సంక్షోభం అనవసర మరణాలకు కారణమవుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌, నైజీరియా వంటి దేశాల్లో కొవిడ్‌ ఆసుపత్రుల్లో అత్యవసర సేవల ఏర్పాట్లు అత్యంత దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐసీయూల్లో అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవడంలో ఆయా దేశాలు విఫలమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌ సంస్థ డైరెక్టర్‌ పీటర్‌ పియట్‌ వెల్లడించారు.

ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నైజీరియాలోనూ ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పలుచోట్ల బ్లాక్‌ మార్కెట్‌లో వీటిని పొందేందుకు రోగుల బంధువులు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌, పెరూ వంటి దేశాల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం రోగుల బందువులు భారీ క్యూలో గంటలకొద్దీ వేచి ఉంటున్నారు. బ్రెజిల్‌లో అనుహ్యంగా పెరిగిన ఆక్సిజన్‌ వినియోగంపై అక్కడి సుప్రీం కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 130 కోట్ల మంది జనాభా కలిగిన ఆఫ్రికా ఖండంలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అత్యంత కీలకమని ఆఫ్రికా సీడీసీపీ డైరెక్టర్‌ జాన్‌ కెంగాసాంగ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభణ కంటే ముందు, ఆఫ్రికాలోని దాదాపు 2600 ఆక్సిజన్‌ సరఫరా కేంద్రాలతో పాటు మరో 69 ప్లాంట్లలో అవసరానికి కంటే సగం కూడా అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో నివారించగలిగే అవకాశాలున్నప్పటికీ ఎన్నో ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

కృత్రిమ కొరత.. ధర 10రెట్లు అధికం

తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చికిత్స పొందే ఓ రోగికి రోజుకు సరాసరి నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో సిలిండర్‌ ధరను పది రెట్లు ఎక్కువకు విక్రయించడంతో రోగులపై తీవ్ర భారం పడుతోందని లాగోస్‌ యూనివర్సిటీ వైద్యులు పేర్కొంటున్నారు. ఇక ఉగాండాలో చోటుచేసుకుంటున్న అవినీతి కొవిడ్‌ రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. దీంతో సరైన సమయంలో ఆక్సిజన్‌ అందక ఈమధ్యే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కొన్ని దేశాల్లో ఆక్సిజన్‌ అందక నిత్యం 50మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ప్రభుత్వాలు ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాటు చేశాయంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో తెలుస్తోంది. ఇక పెరూలోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్‌ అవసరం కావడంతో ఓ యువతి ఐదు రోజులు ఆక్సిజన్‌ సరఫరా కేంద్రం బయటే నిరీక్షించిరావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

సెకండ్‌ వేవ్‌ వేళ..

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రెండో దఫా వైరస్‌ విజృంభణ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం ఆఫ్రికాలోనే కాకుండా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లోనూ ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌, కాంగో, ఘానా, గాంబియా, కెన్యా, మాలీ, తజకిస్థాన్‌ దేశాలకు నిధులు సమకూరుస్తున్నప్పటికీ ఆయా దేశాలు వైద్య సదుపాయాల కోసం ఖర్చుచేసే తీరుపైనా పరిస్థితులు ఆధారపడి ఉంటాయని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధి డాక్టర్‌ మిక్కీ చోప్రా వెల్లడించారు.

ఆక్సిజన్‌ను కేవలం మైనింగ్‌ వంటి పారిశ్రామిక ఉత్పత్తిగానే చాలా దేశాలు భావించడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లలో సరైన టెక్నీషియన్లు, మౌలిక సదుపాయాలు, కరెంటు వంటి వసతులు తప్పనిసరి కావడంతోనే వీటిపై అభివృద్ధి చెందుతున్న దేశాలు నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తున్నారు. అయితే, పలు దేశాల్లో కరోనా మహమ్మారి రెండో దఫా విజృంభిస్తున్న వేళ, మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల సదుపాయాలను మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా కాటుకు 25 లక్షల మంది బలి

ABOUT THE AUTHOR

...view details