అమెరికాలో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. అగ్రరాజ్యంలో వివిధ జైళ్లలోని.. ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరు వైరస్ బారినపడ్డారని సమాచారం. సాధారణ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఆయా బందీఖానాల్లో సుమారు సగానికిపైగా ఖైదీలకు కొవిడ్-19 సోకినట్టు ఓ సర్వేలో తేలింది.
యూఎస్ జైళ్లలో ఇప్పటివరకు సుమారు 2లక్షల 75వేల మందికిపైగా ఖైదీలు కరోనా బారినపడ్డారు. 1,700 మందికిపైగా చనిపోయారు. ఏప్రిల్, ఆగస్టు నెలల్లో కంటే గత వారం రోజుల్లోనే అధిక స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే.. కొవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటించకపోవడం వల్లే.. ఈ స్థాయిలో విజృంభిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు.