ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు ఇంకా తొలగలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఒకరు హెచ్ఐవీ బారిన పడుతున్నారని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) వెల్లడించింది. వీరిలో 20 ఏళ్లలోపు యువకులు, పిల్లలే అధికం. గతేడాది మొత్తం 28 లక్షల మందికి ప్రమాదకర హెచ్ఐవీ సోకగా.. వారిలో 3.20 లక్షల మంది 20ఏళ్ల లోపువారే ఉన్నారని యూనిసెఫ్ పేర్కొంది. వైరస్ బారినపడిన వారిలో 1.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
చిన్న పిల్లలకు హెచ్ఐవీ సోకకుండా చూడటం, వచ్చిన తరువాత నివారించడంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలని యూనిసెఫ్ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిరోధక చర్యలు అంత సంతృప్తికరంగా లేవని పేర్కొంది. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం దేశాల్లో వ్యాధి తీవ్రత అధికంగా కనిపిస్తున్నట్టు వివరించింది.